Ktr: జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చా వేదికగా తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలు, నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానం వంటి కీలక అంశాలపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి అవి తీవ్రమైన విమర్శలకు దారితీస్తున్నాయి. భారత ఎన్నికల కమిషన్ దీనిపై గమనించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అని చెప్పుకుంటూ, ఓటు హక్కును నిర్లక్ష్యం చేయడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది” అన్నారు.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన విధానంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. “కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో ముందుండగా, వాటికి తక్కువ పార్లమెంటు సీట్లు కేటాయించడం అన్యాయం. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణకు విఫలమయ్యాయన్న కారణంతో, అక్కడ పార్లమెంటు సీట్లు పెంచుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది సమాఖ్య వ్యవస్థకు తాకిడి కలిగించడమే,” అన్నారు.
ఈ విషయంలో బీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒకే అభిప్రాయం పంచుకుందని ఆయన తెలిపారు.
భాషా విధానంపై మాట్లాడుతూ, “దేశానికి ఒకే జాతీయ భాష అవసరం లేదు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు సమర్థనీయం కావు. ఇంగ్లీష్ భాష ప్రపంచంలో ఎన్నో అవకాశాలను తెరుస్తుంది. కేవలం హిందీ నేర్చుకొని విదేశాల్లో ప్రయోజనం పొందలేం. భాషా భేదాలు అంగీకరించకపోతే అది దేశ ఐక్యతకు భంగం కలిగించవచ్చు,” అని కేటీఆర్ స్పష్టం చేశారు.