Krishnamachari Srikanth: భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టుపై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా, ఈ జట్టుతో టీ20 ప్రపంచ కప్ గెలవడం అసాధ్యమని స్పష్టంగా చెప్పారు.”ఈ జట్టుతో మనం ఆసియా కప్ గెలిచినా గెలవొచ్చు, కానీ టీ20 ప్రపంచకప్ గెలవడం మాత్రం కష్టమే. మరో ఆరు నెలల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ కోసం ఇదేనా సన్నద్ధత? సెలక్టర్లు జట్టును వెనక్కి తీసుకెళ్లారు” అని ఆయన అన్నారు. కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయడంపై ఆయన తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రింకూ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. వీరి ప్రదర్శనలు అంతగా ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. వైస్ కెప్టెన్సీ నుంచి అక్షర్ పటేల్‌ను తొలగించి, శుభ్‌మన్ గిల్‌ను ఆ స్థానంలో నియమించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్‌ను ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదని శ్రీకాంత్ విమర్శించారు. అతని స్థానంలో శివమ్ దూబేను ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు. మొత్తంగా, భారత క్రికెట్ జట్టు ఎంపికపై శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీ సరైన వ్యూహం లేకుండా ఎంపికలు చేసిందని, ఇది భవిష్యత్తులో భారత జట్టుకు నష్టం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 9న అఫ్గానిస్తాన్- హాంకాంగ్ మధ్య జరగనుంది. టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అలాగే తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న భారత్, ఒమన్‌తో ఆడనుంది.