Chicken At Anganwadi: అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తారనే విషయం తెలిసిందే. సాధారణంగా ఉప్మా, ఉడికించిన గుడ్డు వంటివి అక్కడ ఆహారంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపుగా ఇదే పధ్ధతి ఉంటుంది. అయితే, ఇటీవల ఒక అంగన్‌వాడీ సెంటర్లో ఒక చిన్నారి కోరిన కోరిక విని అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలు అవాక్కయ్యారు. తరువాత తెగ నవ్వుకున్నారు. కానీ, అది అక్కడితో ఆగిపోలేదు. ఏమి జరిగిందంటే..
కేరళలోని ఒక అంగన్‌వాడీలో బిర్యానీ, చికెన్ అడిగే చిన్నారి వీడియో వైరల్ కావడంతో కేరళ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. అవును.. కేరళలోని ఒక అంగన్‌వాడీలో చదువుతున్న ఒక చిన్నారి ఉప్మాకు బదులుగా చికెన్ ఫ్రై, బిర్యానీని అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో, టోపీ ధరించిన పిల్లవాడు అమాయకంగా తన తల్లిని, ‘అంగన్వాడీలో ఉప్మా కాకుండా బిర్యానీ – చికెన్ ఫ్రై నాకు కావాలి’ అని అడుగుతాడు. ఆ పిల్లవాడి తల్లి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది కాస్తా ప్రభుత్వ పెద్దల వద్దకూ వెళ్ళింది.
ఇది కూడా చదవండి: Bird Flu: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ
ఈ వీడియోను రిఫర్ చేస్తూ ఆరోగ్య, మహిళా – శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీణా జార్జ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఆ చిన్నారి అభ్యర్థన చేస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి విడుదల చేసిన వీడియోకు క్యాప్షన్ గా ఆ పిల్లవాడు అమాయకమైన అభ్యర్థన చేశాడు. అంగన్‌వాడీ మెనూను సవరిస్తాం అంటూ పేర్కొన్నారు.
పిల్లలకు పోషకమైన ఆహారం అందేలా అంగన్‌వాడీల ద్వారా వివిధ రకాల ఆహారాలు అందిస్తారు. కేరళలో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో, అంగన్‌వాడీల ద్వారా గుడ్లు – పాలు అందించే పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహిళా – శిశు అభివృద్ధి శాఖ సమన్వయంతో, స్థానిక సంస్థలు అంగన్‌వాడీలలో వివిధ రకాల ఆహారాన్ని అందిస్తాయి.
ఆ చిన్నారి అభ్యర్థనను నెటిజన్లు కూడా సమర్థించారు. జైలులో ఖైదీలకు అందించే ఆహారాన్ని తగ్గించి, అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు మెరుగైన ఆహారాన్ని అందించాలని కొందరు సూచించారు.