KCR: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నివేదికను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా, అది కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం చేయించిన రిపోర్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు భరోసా ఇస్తూ, జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
“కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్!”
కాళేశ్వరం కమిషన్ నివేదిక వెలువడిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో స్పందించిన కేసీఆర్, ఆ నివేదిక విశ్వసనీయతను ప్రశ్నించారు. “అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించిన విధంగానే వచ్చిందని, అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. “కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందే” అని ఆయన తేల్చి చెప్పారు.
“ఎవరూ భయపడొద్దు.. కొంతమందిని అరెస్ట్ చేయొచ్చు”
ఈ నివేదిక నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులలో ఆందోళన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రభుత్వం కొన్ని రాజకీయ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. “కొంతమంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చు.. భయపడొద్దు” అని తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
“కాళేశ్వరం పనికిరాదు అన్నవాడు అజ్ఞాని!”
కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను కేసీఆర్ గట్టిగా తిప్పికొట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని” అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఎంత ముఖ్యమో, దానివల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి లాభాలు కలిగాయో కేసీఆర్ మరోసారి నొక్కి చెప్పారు.