kcr:రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దాక్కున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు కనిపించడం లేదు? ఆయన తన పాత్రను పోషించడం లేదు? మరెవరికైనా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వొచ్చు కదా! ఎందుకు మౌనం దాల్చారు? అన్న ప్రత్యర్థుల ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరనున్నది. కేసీఆర్ జనబాహుళ్యంలోకి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై బాణం ఎక్కుపెట్టనున్నారు. ఏకంగా ఉద్యమాన్నే నడపాలని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలే చెప్తున్నారు.
kcr:బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పాలపకు ఏడాది గడువు మీరగానే ఆపార్టీ పాలనా వైఫల్యాలపై ఎక్కుపెట్టాలని తొలినాళ్లలోనే కేసీఆర్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆ మేరకు వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తనను కలుస్తున్న నేతలకు ఈ సంకేతాలనే ఇస్తున్నారట. వారి ద్వారానే వివిధ అంశాలను తెలుసుకుంటున్నారని సమాచారం.
kcr:లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనేలేదు. శాసనసభా సమావేశాల సమయంలోనూ కేవలం బడ్జెట్ రోజు మాత్రమే హాజరై, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ, బహిరంగ సమావేశాల్లో కానీ ఆయన పాల్గొననే లేదు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాలనా అంశాలు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
kcr:ఆ తర్వాత కొన్నిరోజులు జిల్లాల వారీగా నియోజకవర్గాల ముఖ్య నేతలను రప్పించుకొని వివిధ అంశాలపై చర్చించారు. వారికి భరోసా ఇస్తూ ధైర్యాన్ని నూరిపోశారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న సమయంలోనూ ఆయన వారికి అండగా ఉంటానని, ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. కొంతమందిని పార్టీ మారకుండా కట్టడి చేయగలిగారు. అయినా కొందరు పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్లారు. అయినా కేసీఆర్ మౌనమే దాల్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడించారు తప్ప ఆయన మారు మాట్లాడలేదు.
kcr:హైడ్రా కూల్చివేతల విషయంలోనూ కేసీఆర్ మౌనమే సమాధానమైంది. కేటీఆర్, హరీశ్, సబితా ఇంద్రారెడ్డి ఇతర ముఖ్య నేతలు ప్రభుత్వ వైఖరిపై పోరాడుతూ వచ్చారు. అయితే తనను కలిసిన ముఖ్య నేతలకు మాత్రం ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని సూచించారని తెలిసింది. సమస్యలను లేవనెత్తడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రజల తరఫున ఉండి పోరాడాలని వారికి నూరిపోశారు.
kcr:కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పాలనా వైఫల్యాలపై తొందర వద్దని, ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలని క్యాడర్‌కు కూడా సూచించారు. ఆయన అన్నట్టుగానే కొంత సంయమనం పాటిస్తూ వచ్చారు. ఇక డిసెంబర్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తికావస్తున్నది. ఇక ఆ తర్వాత పార్టీ వైఫల్యాలపై బాణాలు ఎక్కుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరుబాట పట్టాలనే కోణంలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటిదాకా కొంత ఆచీతూచి అడుగేసిన నాయకులు దూకుడుగానే వెళ్లేందుకు సిద్ధం చేస్తున్నట్టు బీఆరెఎస్ వర్గాలు తెలిపాయి.
kcr:డిసెంబర్ నెల 7 నాటికి రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరి ఏడాదవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాల్లో కూడా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కేసీఆర్ అంతర్గత సమావేశాల్లో పిలుపునిచ్చినట్టు తెలిసింది. స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించాలని చెప్పినట్టు తెలిసింది. జనవరి తర్వాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అంతకు ముందు నుంచే పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ బీఆర్ఎస్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

