Kcr: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయని, తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ సందర్భంలో కడియం శ్రీహరి ఓడిపోగా, రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ ఈ సమావేశంలో రాజయ్యకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. కాగా, గతంలో, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించడంతో, ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరికతో, రాజయ్య తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.
ప్రస్తుతం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించడం, భవిష్యత్తులో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన పాత్రపై ఆసక్తి నెలకొంది.

