Kavitha: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గట్టిగా స్పందించారు. ఎల్బీనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ బిడ్డలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేసిన కవిత, పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్, “తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైంది” అని అనడంపై కవిత తీవ్ర అభ్యంతరం తెలిపారు. “తెలంగాణ ప్రజలు ఏనాడూ ఎవరికీ దిష్టి పెట్టలేదు. కోనసీమ లాగా తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రంగా కావాలని కోరుకున్నాం. తెలంగాణ ప్రజల మనసు చాలా మంచిది, మేము పెద్ద మనసుతో ఆలోచిస్తాం” అని ఆమె అన్నారు. తమ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా, తాము ఎప్పుడూ ‘జై తెలంగాణ, జై ఆంధ్రా’ అనే కోరుకున్నామని, తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్రా కూడా అంతే బాగా ఉండాలని ఆశించామని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను. పక్క రాష్ట్రం బాగుంటే మాకు అసూయ ఉండదు. పక్కవారి నుంచి లాక్కోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలని కోరుకుంటాం కానీ, పక్కవారు చెడిపోవాలని అనుకోం. ఒకవేళ అలా అనుకుని ఉంటే తెలంగాణ ఉద్యమం తీరే వేరేలా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప, ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు, అని కవిత వివరించారు. అప్పుడు సినిమా నటుడిగా మాట్లాడారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అని, ఆయన మాటలను ఆంధ్రా ప్రజలందరికీ ఆపాదిస్తారని కవిత హెచ్చరించారు. అందుకే, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అని ఆమె సూచించారు.

