Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు, ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
తాజాగా, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు కే.తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని కవిత పేర్కొన్నారు. “కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిని ఇప్పటికే విచారణ చేశారు. ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారిస్తోంది” అని ఆమె తెలిపారు. అయితే, తాము ఈ వేధింపులకు భయపడబోమని, కేటీఆర్ విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు.
Also Read: Mahesh kumar goud: మంత్రి పొంగులేటి పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్
Kavitha: కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్‌కు తాళం వేయడం, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని కవిత మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అని ఆమె విమర్శించారు.
“మా పార్టీలోపాలను సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం” అని కవిత ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది.