Kannappa: మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కన్నప్ప’ విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదలను ఆలస్యం చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
“కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం. చిత్ర యూనిట్ అందరూ మంచి ఔట్‌పుట్ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయక తప్పలేదు. దీనికి మేమంతా చింతిస్తున్నాం. మీ ఓపికకు, మద్దతుకు కృతజ్ఞతలు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అంటూ విష్ణు ఒక నోట్ విడుదల చేశారు.
ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ భారీ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్రలో నటిస్తుండగా, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, కొత్త విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది.