Kandula durgesh: రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మధుర పూడి విమానాశ్రయంలో రాజమండ్రి-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజన్ కారణంగా రాజమండ్రి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరబోతుందని తెలిపారు. ఇక, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమే కాక, ఈ ప్రాజెక్టు ఫలితంగా విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని వారు తెలిపారు.
విమానయాన సంస్థలు తమ టికెట్ రేట్లను తగ్గించి సామాన్య ప్రజల కోసం కూడా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.మొదటి విమాన సర్వీసులో 120 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ బస్ ముంబైకు బయలుదేరింది. ప్రయాణ సమయం 1 గంట 50 నిమిషాలుగా ఉంది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర్ రావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి కూడా డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభం కానుందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.