Jupally Krishna Rao: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను తప్పించి, ఆమె స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా నియమించారు. జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మొదట విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలతో తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన సీతక్కను నిజామాబాద్ జిల్లాకు పంపించగా, అక్కడి ఇన్చార్జిగా పనిచేసిన జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు ఇచ్చారు. అయితే సీతక్కను మార్చడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన వర్గ విభేదాలు ఉన్నాయన్న విషయం జూపల్లి దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. ముగ్గురు శాసనసభ్యులు, ఒక మంత్రి, నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు… ఎవరికి వారుగా పార్టీలో వర్గపోరును పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేందుకు జూపల్లి మొదట ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్ కావడంతో ఆదిలాబాద్ అత్యంత దూరం అవుతుందన్న కారణం కూడా ఆయనలో ఉందని చెబుతున్నారు.
గతంలో జూపల్లికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పెద్దగా సంబంధాలు లేవు. జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ నేతలతో సంబంధాలు ఉన్నప్పటికీ, అంత బలమైన రాజకీయ బంధం లేనట్లుగానే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్గ విభేదాలను, వివాదాలను చక్కబెట్టారా అన్నది చర్చకు దారితీస్తున్నది. అభివృద్ధి పనుల విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నిధులు కేటాయించే బాధ్యత ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిదే. ఆ విషయం గుర్తెరిగిన నేతలు జూపల్లి ఇన్చార్జి మంత్రిగా నియమితులైన క్షణం నుంచి ఆయనకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో తమ వర్గానికి పెద్దపీట వేయాలంటూ ఆయనపై ఒత్తిడి కూడా పెంచుతున్నట్లు సమాచారం. తూర్పు జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఆ జిల్లాలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Also Read: KISHAN REDDY: పార్టీకి నేతలు కాదు, కార్యకర్తలే బలం
Jupally Krishna Rao: ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ అధ్యక్షుడు రావి శ్రీనివాస్ వర్గాల నడుమ విభేదాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ప్రస్తుత జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల నడుమ పోరు ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర నేత శ్రీకాంత్ రెడ్డి వర్గాల నడుమ, బోథ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్, సోయం బాపురావు వర్గీయుల నడుమ విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు ఖానాపూర్ శాసనసభ్యుడు పీసీసీ ప్రధాన కార్యదర్శి వెడుమ బొజ్జు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ వర్గాల నడుమ కూడా విభేదాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇన్చార్జి మంత్రి జూపల్లిని ప్రసన్నం చేసుకునే దిశగా ఎవరికి వారుగా మంత్రిని జోలకొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నాలకు మంత్రి జూపల్లి ఊ కొడతారా…? ఊహూ అంటారా…? వేచి చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపైకి తేవడం మంత్రి జూపల్లికి కత్తి మీద సామేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.