Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తానంటే.. తానే పోటీ చేస్తానంటూ ఇద్దరు సీనియర్ నేతలు తెరపైకి వచ్చారు. అందులో ఒకరు తాను గెలిచాక మంత్రి పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి వ్యవహారంతో ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన చెందుతున్నది.
Jubilee Hills: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారుతున్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రంగా సాగుతున్న వేళ ఈ ఉప ఎన్నిక వస్తుండటంతో.. పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఉప ఎన్నికకు షెడ్యూలు కూడా విడుదల కాకముందే అధికార కాంగ్రెస్‌లో లొల్లి మొదలైంది. ఉప ఎన్నిక బరిలో ఎవరిని అభ్యర్థిగా దించాలా.. అని రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం పలు విధాలుగా ఆలోచిస్తుండగా ఇద్దరు సీనియర్ నేతలు తానంటే తాను పోటీ చేస్తానంటూ బాహాటంగా ప్రకటించారు.
Jubilee Hills: ఆ ఇద్దరిలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంజనకుమార్ యాదవ్ ఒకరు కాగా, మరొకరు మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజనకుమార్.. తమ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మరో పదవి ఏదైనా వస్తుందని ఆశించారు. అయితే ఆయన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు అధిష్ఠానం రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడంతో అంజన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వాస్తవానికి అనిల్‌కుమార్‌కు తన తండ్రి పలుకుబడితో కాకుండా యువజన కాంగ్రెస్ కోటాలో ఎంపీ పదవి వచ్చింది.
Jubilee Hills: అనిల్‌కుమార్ యాదవ్ ఎనఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేతగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి యూత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పరిచయం, పార్టీ పట్ల అంకితభావమే ఆయనకు పదవిని తెచ్చిపెట్టాయి. అంజనకుమార్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. తన కుమారుడు యూత కాంగ్రెస్ నేతగా స్వతంత్రంగా ఎదిగి ఎంపీ పదవికి ఎంపికయ్యారని, ఇప్పుడు తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు అన్న అంశం తెరపైకి రాదని అంటున్నారు.
మంత్రి పదవి కూడా కావాలి!
Jubilee Hills: జూబ్లీహిల్స్ టికెట్‌తోపాటు గెలిచాక తనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని అంజనకుమార్ యాదవ్ కోరుతున్నారు. సీఎం రేవంతరెడ్డి క్యాబినెట్‌లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి లేకపోవడంతోపాటు యాదవ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించని విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి ముందే డిమాండ్లు విధిస్తున్నారు.
Jubilee Hills: దానం నాగేందర్ మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ఆయన ఆలోచన మరోలా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దానం.. వాస్తవానికి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కండువా మార్చి హస్తం గూటికి చేరారు. ఆయనతోపాటు మరో తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరినా.. వారెవరికీ లేని ఒక సమస్యను నాగేందర్ ఎదుర్కొంటున్నారు.
Jubilee Hills: ఫిరాయింపు ఎమ్మెల్యేలందరిపైనా న్యాయపోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ అధిష్ఠానం.. దానం నాగేందర్‌పై మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దానం సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు పోటీ చేయడమే అందుకు కారణం. అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫారంపై లోక్‌సభకు పోటీ చేయడం ద్వారా సాంకేతికంగా న్యాయపరమైన చర్యలకు ఆయన చిక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దానం మాస్టర్ ప్లాన్
Jubilee Hills: జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే యోచనలో దానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పుడు జూబ్లీహిల్స్‌లో తాను గెలవడంతోపాటు ఖైరతాబాద్‌లో పార్టీ నిలబెట్టే అభ్యర్థిని గెలిపిస్తామనని అధిష్ఠానం వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు రెండు రకాల లాభాలుంటాయని హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు తాను గ్రేటర్ హైదరాబాద్ కోటాలో, మున్నూరుకాపు కోటాలో ఉమ్మడిగా మంత్రి పదవి కూడా కోరవచ్చని దానం భావిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.
Jubilee Hills: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ ఇద్దరు సీనియర్ నేతల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందో లేదో తెలియదు గానీ.. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై మాత్రం వీరి ప్రభావం పడుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఖరారు చేసి.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. మరోవైపు బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉంది.
Jubilee Hills: టీపీసీసీ కూడా నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహనలలో ఒకరికి టికెట్ ఇస్తుందన్న ప్రచారం ఉంది. టికెట్ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అయినందున.. ఎవరు బరిలోకి దిగుతారన్నది తేలాల్సి ఉంది. ఈలోగా సీనియర్ నేతల వ్యవహారంతో పార్టీ గెలుపు అవకాశాలకు గండి పడకుండా చూడాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి.