Janasena Party: 7 సిద్ధాంతాలతో ఆవిర్భవించిన పార్టీ. 11 ఏళ్ల జర్నీ. ఎన్ని ఓటములు ఎదురైనా వెన్ను చూపని లక్షలాది మంది సైన్యం. నమ్మి ఎంచుకున్న దారిలో త్యాగాలకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండే వందలాది మంది నాయకులు. నా దారిదే.. నేను ఎంచుకున్న మార్గం ఇదే.. నన్ను నమ్మిన వాళ్లే నాతో రావాలంటూ.. ముక్కుసూటిగా చెప్పే అధినేత. ఎన్నో విశిష్టతలున్న, ఇంకెన్నో వైవిధ్యాలున్న రాజకీయ వేదిక జనసేన. ఇటువంటి ఒక రాజకీయ పార్టీ పుట్టి, బతికి బట్ట కట్టే పరిస్థితి ఉందా? ఇతడు అసలు రాజకీయాలకు పనికొస్తాడా? అనుకునే రోజుల్లో ప్రయాణం మొదలు పెట్టి.. నేడు ఒక రాష్ట్రానికి భవిష్యత్తుగా ఆవిర్భవించేవరకూ.. జనసేన సాగించిన ప్రస్థానం నిజంగా ఓ అద్భుతం.. అంతకు మించి స్ఫూర్తిమంతం.
పంచభూతాలను గౌరవించే, ప్రకృతిని ప్రేమతో పరిరక్షించుకునే, ప్రాంతాలను మధ్య విద్వేషాలను నిర్మూలించే, కులాలు మతాలు బాషలకు అతీతంగా మనుషుల్ని దగ్గరికి చేర్చే, దేశ భక్తిని గుండెల్లో నింపే సిద్ధాంతాలతో ఒక రాజకీయ పార్టీని నెలకొల్పడాన్ని వింతగా చూశారు 11 ఏళ్ల క్రితం కొందరు కుహనా మేధావులు. రాజకీయ పార్టీకి ఒక నిర్ధిష్టమైన అజెండా ఉండాలని వంకలు పెట్టారు. అధికారంతో పనిలేనప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు, స్వచ్ఛంద సంస్థ నడుపుకోవచ్చు కదా అంటూ ఎగతాళిగా దీర్ఘాలు తీశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే ఒకే ఒక్క నినాదం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఆజ్యం పోసింది.
రాజన్న రాజ్యం అనే ఓ అభూత కల్పన వైసీపీ ఆవిర్భావానికి సరిపోయింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను ఆకాంక్షించే సిద్ధాంతాలతో, మార్పు కోరే భావజాలంతో, గిరి గీసుకుని అధికారం కోసం ఆడే రాజకీయ క్రీడలకు విరుద్ధంగా, రాజకీయం అంటే ఇంతే.. ఇలాగే చేయాలనే అన్ని సరిహద్దుల్ని చెరిపేస్తూ.. సరికొత్తగా ఓ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించడాన్ని సహజంగానే కొన్ని శక్తులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బహుషా వారు ఊహించి ఉండకపోవచ్చు.. ఒక దశాబ్ద కాలంలోనే ఆ పార్టీ ఈ స్థాయి విజయానికి చేరువవుతుందనీ, చెప్పిన సిద్ధాంతాలని ఎక్కడా అతిక్రమించకుండా ప్రజల్ని పాలించేందుకు అర్హత సాధిస్తుందని.
కుట్రలతో ప్రజల్ని నమ్మించి.. ఏ పార్టీ అయినా ఓ సారి అధికారంలోకి రావొచ్చు గాక.. కానీ అదే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుకి మరణ శాసనం అవుతుందనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్మిన రాజనీతి. అధికారం ఎప్పుడు ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసంటారు జనసేనాని. దానిని ప్రజలకు వదిలేసి.. చిత్తశుద్ధితో రాష్ట్ర బాగు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసిన విధానం. 2014లో పార్టీ అంకుర దశలో ఉన్నప్పుడే ఏ స్వార్థం లేకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ పార్టీ పోటీ చేయకుంటే తర్వాతి ఐదేళ్లు ఎన్ని ఒడిదుడుకులు, అవమానాలు ఎదురవుతాయో ఆయనకు తెలీదా? కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క రాష్ట్ర మేలు కోసమే పార్టీ భవిష్యత్తును సైతం పణంగా పెట్టారు పవన్ కళ్యాణ్.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు.. బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాం
తాను కలలుగన్న మార్పును సుసాధ్యం చేసే మార్గాన్ని అన్వేషించే క్రమంలో పదేళ్ల పాటు ప్రయోగాలకు వెనుకాడలేదు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా.. ప్రజల ఆశీర్వాదంగానే స్వీకరించారు. కాకుంటే నిజాయితీతో, నిస్వార్థంగా ముందుకొచ్చే వ్యక్తులకు చట్ట సభలకు వెళ్లే అవకాశం ఇవ్వకుంటే.. ప్రజలు ఏం కోల్పోవాల్సి వస్తుందో సందర్భం వచ్చిన ప్రతిసారీ గుర్తు చేశారు. వైఫల్యాలు ఎదురైనప్పుడు మడి కట్టుకుని కూర్చోలేదు. విధానాలు మార్చుకుంటూ ముందుకెళ్లారు. తప్పుడు మార్గాలు తొక్కకుండా, అవినీతి మరకలు అంటించుకోకుండా రాజకీయం ఎలా చేయొచ్చో.. తన ప్రతి అడుగులో ఆచరించి చూపారు. ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎన్ని దెబ్బలు తగిలినా.. తనదైన మార్గంలో మన కోసం నిలబడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. తన వ్యూహాలతో ప్రత్యర్థులకు గుణపాఠాలు రచించాడు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ఉన్న పార్టీగా చరిత్ర లిఖించాడు.
11 ఏళ్ల జనసేన జర్నీలో అధినేత వెన్నంటి నడిచింది జనసైనికులే. పవన్ పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన సినిమాల ప్రభావం వల్లే జనసేన జెండా పట్టి ఉండొచ్చు. కానీ ఈ పదేళ్ల కాలంలో వాళ్లు కనబరిచిన పరివర్తన.. జనసేనానిని గత ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలబెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. జనసైనికులు అంటే ఆవేశం అనుకునే పరిస్థితి నుండి.. అధినేతకు తగ్గట్లే ఉక్కు సంకల్పం అనుకునే పరిస్థితికొచ్చారు. పోసాని నుండి మొదలు పెడితే చాలా మంది వైసీపీ నేతలు పవన్‌ని ఎన్ని మాటలన్నారో లెక్కే లేదు. జనసైనికులు ఆవేశపరులు మాత్రమే అయితే వారంతా రోడ్లపై తిరిగే పరిస్థితి ఆ రోజే ఉండేది కాదు.
కానీ ఓటములు, అవమానాలు, ప్రత్యర్థుల వెకిలి మాటలతో రాటుదేలిన సమ్మెటలు జనసైనికులు. మరుగుతున్న రక్తాన్ని ఇంధనంగా మార్చుకుని, పిడుగుల్లా ఎప్పుడు గర్జించాలో బాగా ఎరిగిన వాళ్లు కాబట్టే.. ప్రత్యర్థుల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కారు. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో మొట్టమొదటి సారి… పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గెలుపు సంబరంగా జరుపుకుంటున్న జనసైనికులే ఏపీలో ఇవాళ్టి పొలిటికల్ హీరోలు. ఈ సందర్భంగా జనసైనికులకు, వారి అధినేత పవన్ కళ్యాణ్‌కు మహాన్యూస్ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.