Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం (జులై 21, 2025) రాత్రి ఆరోగ్య కారణాలను పేర్కొంటూ, వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. జగదీప్ ధన్‌ఖర్ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం వాస్తవానికి 2027లో ముగుస్తుంది. అయితే, పదవీకాలం రెండేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినందున, భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం త్వరలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు “వీలైనంత త్వరగా” భర్తీ చేయాలి.
ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రాజకీయ పార్టీల మధ్య త్వరలోనే సంప్రదింపులు మొదలయ్యే అవకాశం ఉంది. జగదీప్ ధన్‌ఖర్ రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా, కిథానా గ్రామంలో 1951 మే 18న జన్మించారు. ఆయన ఒక రైతు కుటుంబానికి చెందినవారు.2022 జూలై 16న NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు.
ఇది కూడా చదవండి: ED: రానా, విజయ్ దేవరకొండకు ఈడి నోటీసులు
2022 ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో గెలుపొంది, ఆగస్టు 11, 2022న భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కాలంలో ప్రతిపక్షాలతో తరచుగా వాగ్వాదాలు, న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు, రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ వంటి కొన్ని కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి.