Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జరిగిన పీఏసీ (పార్టీ అఫైర్స్ కమిటీ) సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షం నుంచి వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
“ప్రభుత్వ వేధింపులపై మా కార్యకర్తలు ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు వేధించినా ఆధారాలతో పాటు వీడియోలు, ఫొటోలు ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. వాటిని మన పార్టీ డిజిటల్ లైబ్రరీలో భద్రపరుస్తాం,” అని జగన్ వివరించారు.
జగన్ స్పష్టం చేస్తూ, “అధికారంలోకి రాగానే ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తాం. ఆ ఆధారాలతో సినిమా చూపిస్తాం. వేధింపులు చేసిన వారిని వదిలిపెట్టం. వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు.
వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులూ, రాజకీయ నాయకులూ ఇక జాగ్రత్త పడాలని సూచించారు.