Rajnath Singh: భారత్ జరిపిన ప్రధాన ఉగ్రవాద వ్యతిరేక చర్య “ఆపరేషన్ సిందూర్” అనంతరం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు. సైనికుల ధైర్యసాహసానికి నివాళులర్పించిన ఆయన, “ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు చూపిన పరాక్రమానికి దేశం గర్వపడుతోంది,” అని అన్నారు.
శ్రీనగర్ చేరిన వెంటనే రక్షణ మంత్రి బాదామి బాగ్ కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్లి, 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ ఆర్మీ అధికారులతో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. “నువ్వు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేశావు, దేశం నీకు సెల్యూట్ చేస్తుంది. సమయం వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ వెనుకాడదు,” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగంలో పాకిస్తాన్‌పై గట్టి విమర్శలు చేశారు. “వాళ్లు భారత్‌పై దాడి చేశారు, కానీ మనం ఉగ్రవాదుల ఛాతీపై ఎదురు దాడి చేశాం. పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా ఉపయోగించడాన్ని ఆపాలి. మోసం చేసిన దానికి అది మూల్యం చెల్లించాల్సి వచ్చింది,” అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగితే, భారత్ కూడా మరింత కఠిన చర్యలకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
ఉగ్ర ముప్పు తగ్గుతూ… జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభం
ఇతరవైపు, పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్న వేళ జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో మే 15 నుండి పాఠశాలలు తిరిగి తెరవనున్నట్లు జమ్మూ పాఠశాల విద్యా డైరెక్టరేట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు మళ్లీ తరగతులకు హాజరయ్యే అవకాశం లభించనుంది. రాజౌరి జిల్లాలోని పీరీ, కలకోటే, తన్మండి, ఖవాస్, దర్హాల్ ప్రాంతాల్లోనూ, అలాగే పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్, బుఫ్లియాజ్ ప్రాంతాల్లోనూ పాఠశాలలు చాలాకాలం తర్వాత మళ్లీ తెరవబోతున్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: తెలంగాణ సర్కార్‌కు షాక్.. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోవడం, ప్రజల జీవన శైలిలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని సూచిస్తోంది.