Shubman Gill: బోర్డర్-గవాస్కర్ సిరీస్ దగ్గర పడుతున్న కొద్దీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో కొండంత టెన్షన్. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ క్రమంలో దుర్భేద్యమనుకున్న టీమిండియా… కివీస్ చేతిలో వైట్ వాష్ కావడం క్రికెట్ ప్రపంచానికే షాకిస్తే…పటిష్టమైన ఆసీస్ ను దాని సొంతగడ్డపై నిలువరించే సత్తా, డీలా పడ్డ భారత్ కు ఉందా అన్నది ఓ డౌటనుమానం. అన్నింటికి మించి తొలి టెస్టు జరుగనున్న పెర్త్ లో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరన్నది ఇప్పటికీ ఓ భేతాళ ప్రశ్నే.
రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గ వచ్చేదెవరు? అభిమన్యు ఈశ్వరనా? లేదా కేఎల్ రాహులా అన్నది ఇంకా తెలియలేదు. అసలు రోహిత్ శర్మ కచ్చితంగా సెలవు తీసుకుంటాడా అన్న విషయంపైనా సందేహమే. అన్నింటికీ ఒకవేళ అన్న మాటే ముందుమాటైంది. కోచ్ గంభీర్ మాటల్లో… కేఎల్ రాహుల్ కే ఎక్కువ ఛాన్స్ ఉందన్నట్లు తెలుస్తోంది. కానీ ఇతర ఫార్మాట్లలో ఓపెనింగ్ చేస్తున్న, గతంలో ఆసీస్ గడ్డపై టెస్టుల్లో ఓపెనర్ గా రాణించిన శుభ్మన్ గిల్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యమే.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ!
Shubman Gill: ముందు అభిమన్యు, రాహుల్ పోటీని తీసుకుందాం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరుస సెంచరీలతో హోరెత్తించిన అభిమన్యు ఈశ్వరన్… సహజంగానే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. రోహిత్ ప్లేస్ లో అతనితోనే ఓపెనింగ్ చేయించాలన్నది ప్లాన్. ఇక రాహుల్ చేరిక విచిత్రం. కివీస్ తో తొలి టెస్టులో విఫలమైన తర్వాత కేఎల్ పై వేటు పడింది. కానీ, 150 కొట్టి ఊపుమీదున్న సర్ఫరాజ్… తరువాత తేలిపోయాడు. దీంతో హుటాహుటిన రాహుల్ ను ఆసీస్-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ కోసం ఫ్లయిటెక్కించారు.
అభిమన్యు, కేఎల్… ఇద్దరూ రెండో అనధికారిక టెస్టులో ఓపెనింగ్ కు దిగారు. దారుణంగా విఫలమయ్యారు. 54 టెస్టులాడిన అనుభవమున్న రాహుల్ ఆ టెస్టులో కేవలం 4, 10 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరో వైపు అభిమన్యు కూడా విఫలమయ్యాడు. రెండు మ్యాచుల్లో 4 ఇన్నింగ్సుల్లోనూ కలిపి కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో 17, 0… రెండో టెస్టులో 12, 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరిస్థితుల్లో రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చేదెవరికి అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. అయితే గంభీర్ అనుభవానికే ఓటేసేలా కనిపిస్తున్నాడు. అదే నిజమైతే గతంలో ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వస్తాడు.
ఇది కూడా చదవండి: KL Rahul: స్వేచ్ఛ కోసమే లక్నోను వదిలా స్పష్టం చేసిన కేఎల్ రాహుల్
Shubman Gill: అయితే రాహుల్ లేదా అభిమన్యు. మరిక ప్రత్యామ్నాయాలే లేవా మనదగ్గర అన్న సందేహం వస్తుంది ఎవరికైనా. వీరిద్దరూ విఫలమైన చోట ధృవ్ జురెల్ రెండు హాఫ్ సెంచరీలతో అలరించాడు. అటు బౌన్స్ ను, ఇటు స్సిన్ ను సమర్థంగా, ఓపిగ్గా ఆడి ఆకట్టుకున్నాడు. అతన్ని మిడిలార్డర్లో తీసుకుని గిల్ ను యశస్వికి జోడీగా పంపించవచ్చు. గిల్ చాలాకాలంగా వన్డేల్లో ఓపెనింగ్ పార్ట్ నర్ గా రాణిస్తున్నాడు. దీనికి తోడు గతంలో ఆసీస్ గడ్డపై ఓపెనింగ్ చేసిన అనుభవమూ ఉంది.
2020-21 బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 6 ఇన్నింగ్సుల్లో 259 పరుగులు చేశాడు 51.80 సగటుతో. రోహిత్… యశస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ కు రావడం వల్లే టెస్టుల్లో మూడో స్థానంలో ఆడుతున్నాడు గిల్. ఇపుడతన్నే ఓపెనర్ గా ప్రమోట్ చేసి, జురెల్ వంటి నాణ్యమైన క్రికెటర్ ను తీర్చిదిద్దితే బాగుటుంది కదా అన్నది క్రికెట్ పండితుల మాట. ఇలాంటి సందేహాలన్నింటికీ తెరపడాలంటే పెర్త్ లో టెస్టు ఆరంభమయ్యే నవంబర్ 22 దాకా వేచి ఉండక తప్పదు.