Supreme Court

Supreme Court: టెట్రా ప్యాక్‌లలో వోడ్కా అమ్మకాలు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: టెట్రా ప్యాకెట్లు, చిన్న చిన్న సాచెట్లలో వోడ్కా లాంటి మద్యపానాలను విక్రయించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. సాధారణ పండ్ల రసాల ప్యాకెట్లలా ఉంటూ, లోపల ఏముందో ఎవరూ గుర్తించలేని విధంగా ఉన్న ఈ ప్యాకింగ్ విధానంపై కోర్టు స్పందించింది.

‘కమ్యూనిటీ అగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థ తరఫున న్యాయవాది విపిన్ నాయర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. టెట్రా ప్యాక్‌లలో వచ్చే మద్యంపై కనీసం సరైన హెచ్చరికలు కూడా ముద్రించడం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవి చూడటానికి అచ్చం పిల్లలు తాగే ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లలాగే ఉండటం వల్ల, చిన్న పిల్లలు సులభంగా మద్యపానం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్యాకింగ్‌లను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. టెట్రా ప్యాకింగ్ విధానం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందనే వాదనతో ఏకీభవించింది. అందుకే దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ విభాగాలకు నోటీసులు ఇచ్చింది. నిజానికి టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై గతంలో కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. తాజా నోటీసులతో ఈ ప్యాకింగ్ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *