Team India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కంగరూ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా బ్యాట్లకు పనిచెప్పారు. పెర్త్ స్టేడియంలో రహస్యంగా నెట్స్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) నెట్స్ లో చెమటోడ్చాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) కోసం ఆసీస్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఈ ఏడాది టెస్టుల్లో చెలరేగి ఆడిన యశస్వీ పేస్, బౌన్స్ కు సహకరించే ఆసీస్ పిచ్‌లపై కూడా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా కఠినంగా ప్రాక్టీసు మొదలెట్టాడు. అందుకు తగ్గట్టే ఈ యంగ్ సెన్సేషన్ భారీ షాట్లు ఆడాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతడు కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయట పడింది అవతల ఉన్న రోడ్డు మీద పడింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో యశస్వీతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సాధన చేశారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: యశస్వితో జోడీకి గిల్ తగడా?
Team India: నవంబర్ 22న భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదే జరిగితే రాహుల్, యశస్వీలు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో వెనకబడింది. హ్యాట్రిక్ ఫైనల్ ఆడాలంటే రోహిత్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించాలి. 2017 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకుంటూ వస్తున్న టీమిండియా ఈసారి కూడా కంగారూలకు చెక్ పెడితే.. ముచ్చటగా మూడోసారి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో బరిలోకి దిగే అవకాశముంది.