Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిందని కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో మిగతా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని, తమవైపు దర్యాప్తు ముగిసిందని స్పష్టంచేసింది. అయితే, సుప్రీంకోర్టు నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొంది.
ఈ విచారణ జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జరిగింది. మరోవైపు, వివేకా కుమార్తె సునీత తరపు ప్రధాన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఆ సమయంలో వేరే కోర్టులో ఉండటంతో, జూనియర్ లాయర్ విచారణను పాస్ ఓవర్ చేయాలంటూ కోర్టును కోరారు. ఇదే రోజు మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై ఉత్కంఠ
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్‌ను సవాలు చేస్తూ సునీత రెడ్డి, సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ పిటిషన్‌లపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది.
ఇది కూడా చదవండి: Venkatesh Naidu History: వెంకటేష్ నాయుడు ఫోన్‌లో బిగ్‌బాస్ వీడియోలు!?
వాదనల సందర్భంగా సునీతా తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా – అవినాష్ రెడ్డితో పాటు మిగతా నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని కోరారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయం తెలపాలని సుప్రీం కోర్టు కోరింది.
దర్యాప్తు ముగిసిందా? ట్రయల్‌తో పాటు ఇంకా విచారణ ఉంటుందా?
ఇప్పటి పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు ముగిసిందని తెలిపినప్పటికీ, సుప్రీంకోర్టు నుంచి దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రయల్ ప్రారంభమయ్యే లోపు ఇంకా ఎలాంటి దర్యాప్తు కొనసాగించాలా? లేదా అనేది సీబీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు జరుగుతుందా? లేదా అనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేసు విచారణలో నేటి తీర్పు కీలకంగా మారే అవకాశం ఉంది.

