Dharmasthala: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయం చుట్టూ అలుముకున్న అనుమానాస్పద మరణాల మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), నెత్రావతి నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతోంది. జూలై 31, గురువారం నాడు జరిగిన తవ్వకాల్లో మానవ శరీర అవశేషాలు వెలుగుచూశాయి.
ఇవి పురుషుడికి చెందిన అస్థిపంజర అవశేషాలుగా భావిస్తున్నారు. ఈ అవశేషాలను పూర్తిస్థాయి నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు SIT అధికారులు తెలిపారు. గతంలో ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను 1995 నుంచి 2014 మధ్య సుమారు 20 ఏళ్లలో 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు SITకి వెల్లడించినట్లు సమాచారం. ఈ మృతదేహాలు ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలకు చెందినవని, అనుమానాస్పద రీతిలో అదృశ్యమైనవారని, అత్యాచారాలకు గురై చనిపోయి ఉండవచ్చని అతను ఆరోపించాడు. ఫిర్యాదుదారుడు చూపించిన 13 అనుమానాస్పద ఖనన ప్రదేశాలలో SIT తవ్వకాలు జరుపుతోంది. ఆరో పాయింట్‌లో మానవ అవశేషాలు లభించడంతో తవ్వకాలను మరింత విస్తృతం చేశారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ: ఆగస్ట్ 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్‌పై నిషేధం!
SIT దర్యాప్తులో భాగంగా ఒక PAN కార్డు, ఒక RuPay డెబిట్ కార్డును కూడా ఒక ఖనన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నారు. PAN కార్డును బెంగళూరు రూరల్ జిల్లాలోని నెల్లమంగళకు చెందిన ఒక వ్యక్తిదిగా గుర్తించారు, అయితే అతను కామెర్లు వచ్చి మరణించినట్లు సమాచారం. 2000 నుండి 2015 వరకు గుర్తించబడని మరణాల రికార్డులను తొలగించినట్లు బెల్తంగడి పోలీసులు అంగీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది కేసు దర్యాప్తును మరింత సంక్లిష్టం చేస్తోంది. దర్యాప్తును వేగవంతం చేయడానికి మంగళూరులోని మల్లికట్టేలోని IBలో SIT ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.