TG Inter Board: రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ సిలబస్ నుంచి పరీక్షల విధానం వరకు మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఆధునిక విద్య – AI తరగతుల ప్రారంభం
విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయడానికి బోర్డు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. నవంబర్ నెల నుండి ఇంటర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తరగతులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా విద్యార్థులు నూతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడంతో పాటు, గ్లోబల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
లెక్చరర్ల నియామకాలు – బోధన నాణ్యతపై దృష్టి
ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 494 మంది గెస్ట్ లెక్చరర్లను త్వరలో నియమించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. దీంతో బోధన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: They Call Him OG Review: ఓజీ మూవీ రివ్యూ.. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.. బొమ్మ అదిరిపోయింది..!..
అడ్మిషన్లలో పెరుగుదల
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం 83,635 మంది అడ్మిషన్లు నమోదు కాగా, ఈ ఏడాది 91,853 చేరికలు జరిగాయని కృష్ణ ఆదిత్య తెలిపారు.
పేరెంట్-టీచర్ మీటింగ్‌లు ప్రతి నెలా తప్పనిసరి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ 26న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల చదువు, హాజరు, ప్రవర్తన వంటి అంశాలపై తల్లిదండ్రులు–అధ్యాపకులు చర్చించనున్నారు. ఇకపై డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాలను కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.
హాజరుపై పర్యవేక్షణ
దసరా సెలవుల అనంతరం విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు బోర్డు తెలిపింది. ముఖ గుర్తింపు హాజరు విధానం కారణంగా విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.
కొత్త పాఠ్యపుస్తకాలు – అక్టోబర్ నుంచి ప్రక్రియ
వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త సిలబస్ అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ నెల నుండి కొత్త పాఠ్యపుస్తకాల ప్రక్రియ ప్రారంభం కానుందని కృష్ణ ఆదిత్య ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా సబ్జెక్టుల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
పరీక్షల విధానం
ఇక ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ సిస్టమ్ లేకుండా పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా, సమాన వాతావరణంలో పరీక్షలు రాయగలిగేలా చర్యలు తీసుకుంటున్నామని బోర్డు స్పష్టం చేసింది.