Indian railway: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల టికెట్ ధరలను సవరించింది. ఈ ధరల పెంపు డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానుంది అని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏడాదికి సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం సాధించడమే ఈ నిర్ణయం వెనుక లక్ష్యంగా వెల్లడించింది.
తాజా సవరణల ప్రకారం స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట లభించింది.
215 కిలోమీటర్ల వరకు జనరల్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, అంతకుమించి దూరం ప్రయాణించే ప్రయాణికులపై మాత్రం అదనపు భారం పడనుంది.
పెరిగిన టికెట్ చార్జీల వివరాలు ఇవే…
215 కిలోమీటర్లకు పైగా జనరల్ టికెట్ – కిలోమీటరుకు 1 పైసా అదనపు చార్జీ
ఎక్స్‌ప్రెస్, మెయిల్, నాన్ ఏసీ రైళ్లు – కిలోమీటరుకు 2 పైసలు పెంపు
నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్‌పై అదనంగా రూ.10 పెంపు
గత పదేళ్లలో రైల్వే శాఖ తన కార్యకలాపాలను గణనీయంగా విస్తరించిందని తెలిపింది. దీనికి అనుగుణంగా మానవ వనరులు పెంచడం, నిర్వహణ ఖర్చులు భరించేందుకు ఆదాయం అవసరమైందని వివరణ ఇచ్చింది.
భారీగా పెరిగిన ఖర్చులు
2024–25 ఆర్థిక సంవత్సరంలో
జీతాలు, ఇతర ఖర్చులకు రూ.1.15 లక్షల కోట్లు,
పెన్షన్లకు రూ.60 వేల కోట్లు,
మొత్తం మీద రూ.2.63 లక్షల కోట్ల వ్యయం అయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఆదాయ వృద్ధి కోసం ప్రయాణికుల చార్జీల పెంపుతో పాటు సరుకు రవాణా (ఫ్రైట్) సేవలను పెంచడంపైనా దృష్టి సారిస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

