Warangal: వరంగల్ వర్ధన్నపేట మండలం గుబ్బేటి తండాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు ఒక తండ్రి ప్రాణాలు బలి తీసుకున్నాయి. పోలీసుల సమాచారం మేరకు, గుబ్బేటి తండాకు చెందిన సఫవాట్ రాజు(65) తన కుమారుడు సురేష్, కోడలు మధ్య జరుగుతున్న వాగ్వాదాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కొడుకు సురేష్ తన తండ్రిపై దాడి చేశాడు. ఛాతీ మీద బలంగా కొట్టడంతో సఫవాట్ రాజు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన, విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. గ్రామస్థుల చెబుతున్న వివరాల ప్రకారం, సురేష్ తరచూ కుటుంబంలో చిన్నచిన్న విషయాలకే కోపగించుకునేవాడని, భార్యతో తరచూ గొడవలు జరిగేవని సమాచారం.