Hyderabad: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు, అంటే ఈ నెల 30 వరకు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి 26నాటికి వాయుగుండంగా మారి, 27న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం రోజుల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండగా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.