Hyderabad : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సోమవారం ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో, దాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా కార్యాలయానికి వచ్చారు.
లైసెన్స్ రీన్యువల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన అధికారిక కార్యక్రమాలు పూర్తిచేశారు. అధికారుల సూచనల మేరకు తన ఫోటోను సమర్పించి, అవసరమైన పత్రాలపై సంతకాలు చేశారు.
నాగార్జున ప్రత్యక్షంగా రావడంతో కార్యాలయంలోని సిబ్బంది, అధికారులు ఎంతో ఉత్సాహంగా స్పందించారు. ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు తీయడానికి ఆసక్తి చూపారు. నాగార్జున కూడా వారిని ఆనందంగా కలుసుకుని, ఫోటోలకు పోజులిచ్చారు. అనంతరం సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించి, తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.