Hyderabad Metro Expansion

Hyderabad Metro Expansion: ఎయిర్​పోర్ట్ టు ఫ్యూచర్​ సిటీ.. 40 కి.మీ. మేర మెట్రో విస్తరణ

Hyderabad Metro Expansion: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా మెట్రో రైలు ఫ్యూచర్ సిటీ వరకు చేరేలా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు వేమ నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ కార్యదర్శి వి. శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండో దశ మెట్రో విస్తరణ – కీలక మార్గాలు

నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు 36.8 కి.మీ.,
రాయదుర్గం నుండి కోకాపేట నియోపొలిస్ వరకు 11.6 కి.మీ.,
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.,
మియాపూర్ నుండి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ.,
ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ. —
ఇలా మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణ కోసం రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రాజెక్టు కేంద్ర-రాష్ట్ర జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి.

ఫ్యూచర్ సిటీకి మెట్రో లింక్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు సుమారు 40 కి.మీ మేర కొత్త మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను మీర్‌ఖాన్‌పేట వరకు విస్తరించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: KRM Cabinet Race: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మరో మంత్రి?

ఈ కొత్త రూట్‌కి అవసరమయ్యే అంచనాలతో కూడిన డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ ప్రాజెక్టులో హెచ్ఎండీఏతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను భాగస్వామ్యులుగా చేయాలని సూచించారు.

కేంద్ర అనుమతుల కోసం కసరత్తు

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమావేశంలో అధికారులు సీఎంను వివరించారు. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ద్వారా నగర అభివృద్ధి మరింత వేగవంతం కానుందని, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *