Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కిరాయికి హత్యలు చేసే ఓ కాంట్రాక్ట్ హంతకుడు హత్యకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన డబ్బులు అందలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. జూన్ 7, 2023న, మీరట్‌లోని ఉమేష్ విహార్ కాలనీకి చెందిన అంజలి, డెయిరీ ఫామ్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కాల్చి చంపారు.
హత్యకు గురైన అంజలి తన మాజీ భర్త నితిన్ గుప్తా పేరుతొ ఉన్న ఓ ఇంట్లో నివసిస్తోంది. ఆమె అత్తగారు ఇంటిని యశ్‌పాల్, సురేష్ భాటియాలకు అమ్మేశారు. అయితే అంజలి మాత్రం ఇల్లు ఖాళీ చేయనని తేల్చి చెప్పింది.
దీని తర్వాత అంజలిని చంపితే 20లక్షల రూపాయలు ఇస్తామని యశ్‌పాల్, సురేష్ ఇద్దరూ కలిసి నీరజ్ శర్మ అనే కిరాయి హంతకునితో బేరం కుదుర్చుకున్నారు. దీంతో ఈ నీరజ్ శర్మ మరోవ్యక్తితో కలిసి అంజలిని కాల్చి చంపాడు.
ఇది కూడా చదవండి: Fake Currency: యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ.. తరువాత ఏమైనదంటే..
Uttar Pradesh: ఈ హత్యకు సంబంధించి అంజలిని కాల్చి చంపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, హత్యకు సంబంధించి ఇప్పటికే అరెస్టు చేసిన మహిళ మాజీ భర్త మరియు అత్తమామలను పోలీసులు విడుదల చేశారు.
ఈ కేసులో, ఏడాది తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన నీరజ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంజలిని హత్య చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారని.. మిగిలిన రూ.19 లక్షలు తనకు ఇవ్వలేదంటూ కేసు పెట్టాడు. హత్య జరిగిన వెంటనే పోలీసులకు దొరికిపోయాననీ.. దీంతో మిగిలిన డబ్బు ఇవ్వలేదని చెప్పాడు. బెయిల్‌పై వచ్చిన తరువాత, నేను మిగిలిన డబ్బు చెల్లించమని కోరగా, వారు ఆ డబ్బు ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. దీనికి సాక్ష్యంగా హత్యకు డబ్బు ఇస్తామన్న వారి కాల్ రికార్డ్ లు అందించాడు.