High Court:సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి సుమారు 46 మంది కార్మికులు సజీవ దహనమై నాలుగు నెలలు గడిచినా మృతుల కుటుంబాలకు ఇస్తామన్న రూ.1 కోటి సాయం ఇప్పించలేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఆ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడింది. సిగాచి ఫార్మా కంపెనీ అగ్నిప్రమాదంపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ సమయంలో న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.
High Court:ఘటన జరిగిన నాలుగు నెలలైనా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని, కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీశారు.
High Court:దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. కోటి రూపాయల నష్టపరిహారంపై కంపెనీ యాజమాన్యం స్పందించాల్సి ఉన్నదని, నిపుణుల కమిటీ నివేదిక వారం క్రితమే వచ్చిందని తెలిపారు. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నివేదిక ప్రకారం కంపెనీ ఎవరి ఆధీనంలో ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తిని ప్రశ్నించారు.
High Court:దీనికి ప్రతిగా కంపెనీ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధీనంలోనే ఉన్నదని, నివేదిక అధ్యయనం చేసేందుకు ఏజీ గడువు కోరినట్టు తెలిపారు. దీంతో రెండు వారాల్లోగా నిపుణుల నివేదిక మీద అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 27వ తేదీకి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

