Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దెబ్బతిన్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, వేలాది విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
మరోవైపు, విద్యా రంగానికి నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తుందో ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా నోట్ల రద్దు, కరోనా వంటి సంక్షోభాల మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగలేదని గుర్తుచేశారు.
ఫీజులు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు, అద్దెలు, బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడానికి కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బకాయిలను విడుదల చేయకపోతే, విద్యారంగ సమస్యలపై పెద్ద పోరాటానికి సిద్ధమవుతామని హరీశ్ రావు హెచ్చరించారు.