Dark Patterns: వినియోగదారులను తప్పుదారి పట్టించే లేదా మోసం చేసే విధంగా తయారు చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark Patterns) అనే డిజైన్ పద్ధతులను తమ ప్లాట్‌ఫామ్‌ల నుండి పూర్తిగా తొలగించామని దేశంలోని 26 ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. ఈ జాబితాలో జెప్టో, బిగ్‌బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, జియో మార్ట్ వంటి అగ్రగామి కంపెనీలు ఉన్నాయి.
డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి?
డార్క్ ప్యాటర్న్స్ అంటే వినియోగదారులను ఏదైనా చర్య తీసుకోవడానికి (కొనుగోలు చేయడం లేదా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వంటివి) బలవంతం చేసే లేదా తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లలో రూపొందించబడిన మోసపూరిత పద్ధతులు. 2023లో ఈ మోసపూరిత డిజైన్ పద్ధతులను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
డార్క్ ప్యాటర్న్స్‌కు కొన్ని ఉదాహరణలు:
- తక్కువ రేటు చూపడం: మొదట్లో ఉత్పత్తి(Product ) ధర తక్కువగా చూపించి, చెల్లింపు (బిల్లింగ్) సమయంలో షిప్పింగ్ లేదా ప్రాసెసింగ్ వంటి ఇతర ఫీజులను కలిపి అసలు ధరను పెంచడం.
- నాసిరకం లేదా అధిక ధర: తక్కువ రేటు ఉన్న ఉత్పత్తి ‘స్టాక్ అయిపోయింది’ అని చూపించి, దానికి సమానంగా ఉండే అధిక ధర ఉన్న ఉత్పత్తిని కొనుగోలు చేయమని వినియోగదారులను ప్రేరేపించడం.
- గాబరా పెట్టడం (Urgency): కేవలం 2 యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఆఫర్ ఇంకో 10 నిమిషాల్లో ముగుస్తుంది వంటి అంటూ చెప్పి కావాలనే కొరతను సృష్టించి, త్వరగా కొనుగోలు చేయమని బలవంతం పెట్టడం.
- సబ్స్క్రిప్షన్ ట్రాప్: సులభంగా సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇచ్చి, దానిని రద్దు చేసుకోవడానికి మాత్రం చాలా క్లిష్టమైన పద్ధతిని పెట్టి వినియోగదారులు సబ్స్క్రిప్షన్ కాన్సుల్ చేసుకోనివ్వకుండా ఉంచడం.
ఇది కూడా చదవండి: ENG vs AUS: నేటి నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మహాపోరు!
కంపెనీల స్వీయ-నియంత్రణ ప్రకటన
ఈ 26 ఈ-కామర్స్ కంపెనీలు అంతర్గత (Internal) లేదా థర్డ్ పార్టీ (Third Party) ఆడిట్లు నిర్వహించి, తమ ప్లాట్‌ఫామ్‌లలోని తప్పుడు ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్స్‌ను పూర్తిగా తొలగించినట్లు ప్రభుత్వానికి నివేదించాయి.
సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ చర్యను స్వాగతించింది. ఇతర సంస్థలు కూడా ఇదే విధంగా స్వయంగా నియంత్రణలు పాటించి,కొనుగోలుదారులకు మంచి సేవలు అందించాలని సూచించింది.
ఫిర్యాదు చేయండి: సీసీపీఏ పిలుపు
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, డార్క్ ప్యాటర్న్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీసీపీఏ సూచించింది. ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఇలాంటి మోసపూరిత పద్ధతులు గమనించినట్లయితే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
ఫిర్యాదు మార్గాలు: నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (National Consumer Helpline) ద్వారా లేదా సోషల్ మీడియా ప్రచారాల ద్వారా వినియోగదారులు డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించి ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా డిజిటల్ మార్కెట్లో పారదర్శకత, విశ్వాసం పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

