Gautam Gambhir: ఫలితాలు రాకపోతే ఎవరినైనా పక్కకు పెట్టే బిసిసిఐ ఇప్పుడు గౌతం గంభీర్ కు ఇచ్చిన పూర్తి అధికారాలకు కత్తెర పెట్టనుందా.? అంటే అవుననే అంటున్నారు. కోచ్ గా గంభీర్ అడిగిన ప్రతిదానికి ఆమోదం తెలిపినా.. కివీస్ తో వైట్ వాష్ అనంతరం సీన్ మారిందంటున్నారు. ఆసీస్ తో జరిగే బిజిటి సిరీస్ లో ఫలితాలు అనుకున్నట్లు రాకపోతే అతడికి ఇబ్బందులు వస్తాయని అధికారాలకు కత్తెర పడుతుందని తెలుస్తోంది.
కోచ్ గౌతం గంభీర్ కు ఇదివరకు ఎవరికీ దక్కని చాలా మినహాయింపులు దక్కాయి. పూర్తి అధికారాలతో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడు అడిగిన ప్రతిదానికి బీసీసీఐ ఆమోదం తెలిపింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు ఎంపికలో కోచ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. కానీ, ఆస్ట్రేలియా పర్యటన కోసం జరిగిన సమావేశంలో గంభీర్ కోసం ఆ రూల్ నుంచి వెసులుబాటు కల్పించింది.
ప్రధాన కోచ్ తనకు అవసరమైన ఆటగాళ్లపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి అనుమతిచ్చింది. హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాలని కోరినా.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా దీనికి కూడా అంగీకరించింది. అయితే, ఈ సిరీస్‌ను గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకపోతే మాత్రం గంభీర్ తన అధికారాల్లో కోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Team India: ‘దులీప్’ను మరిచిన ఫలితమే ఇది
టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంకలో ముగిసిన టీ20 సిరీస్‌ను గెలుచుకున్నా.. వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్ పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. కానీ, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్‌పై భారీ అంచనాలు ఉండడంతో ఈసారి వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకోవాలనే లక్ష్యాన్ని అందిస్తాడని నమ్మకంతో ఉంది.
అయితే ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లడమే కష్టంగా మారడంతో అతని సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇవ్వని వెసులుబాటు ఇప్పటివరకు గంభీర్‌కు బీసీసీఐ మేనేజ్‌మెంట్ ఇచ్చింది. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో సిరాజ్‌ను నైట్‌వాచ్‌మెన్‌గా పంపడం, సర్ఫరాజ్‌ఖాన్‌ను 8వ నంబర్‌లో ఆడించాలని అనుకోవడం ప్రతికూల ఫలితాలను అందించాయి. దీంతో గంభీర్ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ ఆసీస్ పర్యటనలోనూ ఓటమి ఎదురైతే అతడి అధికాలకు కత్తెర వేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

