Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: Chevireddy Bhaskar Reddy: కళ్లు తెరవకపోతే కూటమి కష్టాలు తప్పవా?
బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం
బీఆర్‌ఎస్ నేతలు సీఎం పర్యటన సందర్భంగా తమ నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా పేర్కొంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తత దిశగా వెళ్లే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.