Clue

Clue: హంతకుడిని పట్టించిన ఈగ..ఎలా అంటే..

Clue: పోలీసులు ఎప్పుడూ ఒక మాట చెబుతారు. ఎంతటి నేరస్థుడైనా.. ఎన్ని తెలివితేటలను ప్రదర్శించినా.. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే కచ్చితంగా క్లూ దొరుకుతుంది అని అంటారు. ఎంత క్లిష్టమైన కేసులో అయినా ఒక్కోసారి చిన్న క్లూ తో నిందితులను దొరికించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ క్లూలు కూడా విచిత్రంగా బయటపడతాయి. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. పోలీసు అధికారులు తలలు బాదుకున్నా నేరస్థులు దొరకరు. అనుకోకుండా ఫ్లాష్ లా చిన్న ఆలోచన ఎవరో ఒక అధికారికి వస్తుంది. ఆ ఆలోచనలో ఠక్కున క్లూ దొరుకుతుంది. సరిగ్గా అలాంటి సంఘటన నిజంగా జరిగితే.. ఇదిగో అలాంటి కేసు ఇది. తన మామను చంపేసి.. తీరుబాటుగా.. ఏమీ తెలియనట్టు పోలీసుల పక్కకు వచ్చి నిలబడి చూస్తున్న నిందితుడిని ఒక ఈగ పట్టించేసింది. ఈగ అంటే ఈగ సినిమాలోలా ఫైట్ చేసి పగ తీర్చుకోవడం కాదు. ఒక ఈగ పోలీసులకు లీడ్ ఇచ్చింది. క్లూ దొరికించింది. 

 

Clue: వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్‌పూర్ లో పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. మనోజ్ ఠాకూర్‌ అనే వ్యక్తి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరోజు ముందు బయటకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదని బంధువులు పోలీసులకు చెప్పారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. అయితే, మరునాడు ఉదయం వోరి తప్రియా గ్రామంలోని వ్యవసాయ భూమిలో మనోజ్ మృతదేహం కనిపించింది.

 

Clue: దీంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. హత్యకు గురైన మనోజ్ ఠాకూర్  బంధువులను విచారించారు. సంఘటనా స్థలంలో క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఏ ఒక్క క్లూ వారికీ దొరక లేదు. ఈలోపు హతుడి అల్లుడు ధరమ్ ఠాకూర్ నల్లచొక్కా ధరించి అక్కడకు వచ్చాడు. పోలీసులు మామూలుగానే అతన్ని వివరాలు అడిగారు. అతను కూడా చాలా మామూలుగా అన్ని విషయాలు చెబుతూ పోయాడు. అయితే, అక్కడ ఉన్న ఒక పోలీసు అధికారికి అతనిపై ఎందుకో అనుమానం వచ్చింది. ధరమ్ కళ్ళు ఎర్రగా ఉండడం గమనించాడు. ముందు అది తన మామ చనిపోవడం వలన బాధతో అని అనుకున్నాడు. కానీ, తరువాత పరిశీలనగా ధరమ్ ను చూడగా ఒక ఈగ ఆ పోలీసు అధికారి దృష్టిని ఆకర్షించింది. దానిని మరింత దగ్గరగా చూసిన అతనికి ఎక్కడో అనుమానం వచ్చింది. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులకు ఈగ విషయం చెప్పాడు ఆ అధికారి. ఫోరెన్సిక్ అధికారులు  ఈగను పరిశీలించి అవాక్కయ్యారు. ఎందుకంటే, ఈగ కాళ్లపై రక్తం మరకలు ఉన్నాయి. దీంతో మరింత పరీక్షగా ధరమ్ చొక్కా పరిశీలిస్తే దానిపై కూడా రక్తపు మరకలు కనిపించాయి. అది నల్ల చొక్కా కావడంతో రక్తపు మరకలు పైకి కనిపించడం లేదు. 

 

Clue: ఈగ ఇచ్చిన క్లూతో ధరమ్ ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో కోటింగ్ ఇచ్చేసరికి నిజం బయటకు వచ్చింది. తానె తన మామను చంపానని ధరమ్ ఒప్పుకున్నాడు. ఆస్తి, డబ్బు విషయంలో గొడవలు రావడంతో నిందితుడు తన మామ మనోజ్ ఠాకూర్‌ను హత్య చేసినట్టు చెప్పాడు. 

అదండీ విషయం.. పోలీసు కేసుల్లో వచ్చే చిన్న అనుమానం.. దొరికే అతి చిన్న క్లూ ఎలా నేరస్థులను పట్టిస్తాయో ఈ కేసులో స్పష్టం అవుతుంది. ఈగే కదా అని లైట్ తీసుకోకుండా.. పరిశీలనగా చూడటంతో ఈ కేసులో నేరస్థుడు దొరికిపోయాడు.  

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *