Student Suicide: మేడ్చల్ జిల్లా నారపల్లిలో ని కాలేజీలో రాగ్గింగ్ కలకలం. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జాదవ్ సాయి తేజ (19) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
సాయి తేజ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందినవాడు. మధు బాయ్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అతడు, సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. స్నేహితుల వివరాల ప్రకారం – సీనియర్లు బలవంతంగా మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్‌కు తీసుకెళ్లారు. అక్కడ రూ.10 వేల బిల్లు రాగానే, అదే మొత్తాన్ని సాయి తేజ చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ సంఘటనతో గాయపడ్డ మనసుతో తీవ్ర నిరాశకు గురై చివరికి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Indrakeeladri: బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ తొలి దర్శనం.. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు..
సూచన అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ర్యాగింగ్ ఒత్తిడి ప్రధాన కారణమా? లేక వేరే కారణాలున్నాయా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు ఉన్న చట్టాలు సరైన విధంగా అమలు అవుతున్నాయా? అనే ప్రశ్న తల్లిదండ్రులను, విద్యార్థులను, అలాగే కళాశాల యాజమాన్యాన్ని మరోసారి ఆలోచనలో పడేసింది.
ఈ ఘటనతో విద్యార్థుల్లో భయం నెలకొనగా, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాగింగ్ అనే దారుణపు అలవాటు మరోసారి నిర్దోషి ప్రాణాన్ని బలితీసుకోవడం సమాజం మొత్తాన్ని కలచివేసింది.