ED: గ్యాంగ్‌స్టర్ నయీం కేసు విషయంలో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. నయీంకు సంబంధించిన ఆస్తులను ఆరా తీసింది. ఇప్పటికే 35 ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలకు దిగింది. నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై వాటిని రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. నయీం ఆయా ఆస్తులను అక్రమంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరున రిజిస్టర్ చేసినట్టు ఈడీ నిర్ధారించింది.
ED: నయీం హత్య అనంతరం ఐటీ అధికారులు, సిట్ ఇచ్చిన సమాచారంతో ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈ ఈసీఐఆర్‌లో నయీం కుటుంబ సభ్యుల పేర్లను చేర్చింది. అదే విధంగా నయీంపై భువనగిరిలోని క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. కోట్లాది ఆస్తులు సంపాదించినా నయీం కుటుంబ సభ్యులు ఐటీఆర్ ఫైల్ చేయలేదని ఈడీ పరిశోధనలో తేలింది.
ED: భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం చిన్న చిన్న నేరాలు చేస్తూ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఓ పోలీస్ అధికారి హత్యతో ప్రధాన నిందితుడైన అతను కొందరు పోలీసులు, రాజకీయ నేతల అండతో పెద్ద క్రిమినల్‌గా మారాడు. రెండు దశాబ్దాలకు పైగా నేర సామ్రాజ్యాన్ని ఏలిన నయీం.. అదే రాజకీయ నేతలు, పోలీసుల అండతో ఎన్నో సెటిల్‌మెంట్లు చేసి కోట్లాది ఆస్తులను కూడబెట్టాడు.
ED: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక నయీం అరాచకాలు మితిమీరి పోయాయి. అదే దశలో 2016లో షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించాడు. ఆ తర్వాత అతని బాధితులంతా వచ్చి ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. నయీంపై 27 హత్య కేసులు, 200కు పైగా ఇతర కేసులు నమోదై ఉన్నాయి. నయీం కేసులో మనీలాండరింగ్ జరగడంతో 2020లో ఈడీ కేసు నమోదు చేసింది.

