Earthquake: కమ్చత్కాలో వరుస భూకంపాలు – ప్రజల్లో భయాందోళనలు

Earthquake: రష్యాలోని కమ్చత్కా ద్వీపకల్పంలో భూకంప ప్రకంపనలు మళ్లీ మళ్లీ కొనసాగుతుండటం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం నుంచి ప్రజలు కోలుకోకముందే, ఆగస్టు 2న మరోసారి భూమి కంపించింది.

వివరాల్లోకి వెళితే… జూలై 30న కమ్చత్కా తీర ప్రాంతంలో 8.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ప్రారంభంలో దీనిని 8.0గా అంచనా వేసినప్పటికీ, యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తాజా సమాచారం ఆధారంగా తీవ్రతను 8.7గా సవరించింది. ఈ భూకంప కేంద్రం, పెట్రోపావ్లోవ్స్క్-కమ్చత్స్కీ నగరానికి ఆగ్నేయ దిశగా 125 కిలోమీటర్ల దూరంలో సముద్రపు 19.3 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

ఈ భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రాన్ని కలిచివేసింది. రష్యా, జపాన్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మూడు గంటల్లో సునామీ అలలు తాకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనితో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భూకంప సమయంలో భవనాలు కదిలిపోవడం, ఫర్నిచర్ సరిగా నిలవకపోవడం వంటి ఘటనలతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం, భూకంప దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల భవనాలు, మౌలిక వసతులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఇక, ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే శనివారం (ఆగస్టు 2) ఉదయం 11:06 గంటలకు (GMT ప్రకారం) అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.4గా నమోదైందని జర్మనీకి చెందిన జీఎఫ్జెడ్ (GFZ) జియోసైన్సెస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

భూగర్భ శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, కమ్చత్కా ప్రాంతం ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’లో భాగమై ఉండటమే ఇలాంటి వరుస భూకంపాలకు కారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం భూకంపాలు, అగ్నిపర్వతాల చర్యలకు అత్యంత గురిచయ్యే టెక్టోనిక్ జోన్‌గా గుర్తించబడింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *