Palapitta: విజయదశమి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే ఆధ్యాత్మిక, సాంప్రదాయ వేడుకల్లో ఒకటి. తెలంగాణలో బతుకమ్మ, ఆంధ్రప్రదేశ్లో దేవీ నవరాత్రులు ప్రత్యేకంగా జరిపినా.. దసరా రోజున రెండు ముఖ్యమైన ఆచారాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. అవి జమ్మి చెట్టు దర్శనం మరియు పాలపిట్టను చూడటం.
పాలపిట్ట ఎందుకు ముఖ్యమైంది?
పాలపిట్టను చూడటం శుభప్రదమని, అదృష్టాన్ని కలిగిస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ప్రభుత్వం దానిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా కూడా భావిస్తారు. విజయదశమి రోజున పాలపిట్ట ఉత్తర దిశ వైపున కనిపిస్తే ఆ సంవత్సరం అంతా విజయవంతంగా సాగుతుందని పెద్దలు చెబుతుంటారు.
పురాణ కథల ఆధారం
ఈ ఆచారానికి వెనుక రెండు ప్రముఖ పురాణ కథలు ఉన్నాయి.
-
మహాభారత కథనం
పాండవులు తమ అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కలిగిందట. ఆ దర్శనం వారికి విజయాన్ని సూచించింది. ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో వారు కౌరవులపై విజయం సాధించారు. అప్పటి నుంచి పాలపిట్టను విజయానికి సంకేతంగా భావించే సంప్రదాయం కొనసాగుతోంది. -
రామాయణ సందర్భం
శ్రీరాముడు రావణునితో యుద్ధానికి బయలుదేరే ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నారని ప్రతీతి ఉంది. ఆ దర్శనం ఆయనకు విజయం ప్రసాదించిందని చెబుతారు. అందుకే భక్తులు ఈ పక్షి దర్శనం కలిగితే తాము చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తామనే విశ్వాసం కలిగి ఉంటారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: ఎలిమినేట్ కి దగ్గరగా ఉన్న హరీష్, శ్రీజ..!
నగరాలు, గ్రామాల్లో సంప్రదాయం
గ్రామాల్లో దసరా రోజున ప్రజలు పొలాల వద్దకు వెళ్లి పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ పట్టణాల్లో ఈ పక్షిని చూడటం కష్టతరమైపోయింది. అందువల్ల కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ దర్శనం చేసే సంప్రదాయాలు కూడా చోటు చేసుకున్నాయి.
విజయదశమి సారాంశం
మొత్తం మీద విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ రోజున జమ్మిచెట్టు దర్శనం, పాలపిట్టను చూడటం ద్వారా ప్రజలు శుభాలను, విజయాన్ని తమ జీవితంలోకి ఆహ్వానించుకుంటారు. అందుకే ఈ రెండు ఆచారాలు దసరా పండుగలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.