Head master: విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన చేష్టలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన, తాను పనిచేసే పాఠశాల ఆవరణలోనే మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించి వివాదానికి దారి తీశారు.
వివరాల్లోకి వెళ్తే… మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తరచూ మద్యం సేవించి విధులకు వస్తున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ అధికారులకు చేరాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపేందుకు డిప్యూటీ డీఈఓ స్వయంగా పాఠశాలకు వెళ్లారు.
అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రధానోపాధ్యాయుడు విచారణకు సహకరించకపోగా, అధికారిపై అసభ్య పదజాలంతో దూషణలు చేశారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.
వీడియో వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై దృష్టి సారించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పవిత్రమైన పాఠశాల ప్రాంగణంలో గురువు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.