YVS Chowdary: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచిలి రత్నకుమారి (88) గురువారం సాయంత్రం 8:31 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు చౌదరి స్వయంగా ప్రకటించారు. తల్లి మరణంపై వైవీఎస్ చౌదరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక లేఖను విడుదల చేశారు.
మా అమ్మ రత్నకుమారికి అక్షరం ముక్క రాదు. కానీ, లారీ డ్రైవర్గా పనిచేసిన మా నాన్న యలమంచిలి నారాయణరావు సంపాదనతోనే మా ముగ్గురు పిల్లలను అద్భుతంగా పెంచింది. పౌష్టికాహారం, బట్టలు, అద్దె, చదువు, వైద్యం… వీటితో పాటు సినిమాలు, గుడి దర్శనాలు, పండుగ సెలబ్రేషన్స్ వరకు అన్ని అవసరాలకు తన ‘నోటి మీది లెక్కలతోనే’ బడ్జెట్ను కేటాయించేవారు. ఆమె నిజంగా ఆర్థిక రంగ నిపుణురాలు అని చౌదరి పేర్కొన్నారు.
Also Read: Chiranjeevi: బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన: అసెంబ్లీలో చర్చకు క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్
మా అమ్మ ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి, పనిమనిషి సహాయం లేకుండా అన్నీ తానై చూసుకునేవారు. తన బిడ్డలకు మంచి జీవితాన్ని అందించడం కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. ఆమె మమ్మల్ని పెంచిన విధానం, ఆమె తెలిసిన లెక్కలు ఏ చదువూ నేర్పించలేనివి. ఆమె మాలో నింపిన స్ఫూర్తితోనే నేను ఈ స్థితికి వచ్చాను అని చౌదరి ఆవేదనతో తెలిపారు.
వైవీఎస్ చౌదరి తన తల్లిని ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, కానీ ఆ సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తి’ అని భావోద్వేగంగా వర్ణించారు. ఆమె ఈ లోకం నుంచి వెళ్లిపోయి, దివిలో ఉన్న తన తండ్రి, అన్నను కలుసుకోవడానికి వెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు వైవీఎస్ చౌదరి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.