Delhi: హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు చేస్తున్న దర్యాప్తులో కొన్ని కీలకమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విచారణ సందర్భంగా జ్యోతిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, తాను చేసిన పనికి ఏ మాత్రం బాధపడడం లేదని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఆమె తన చర్యలు వాక్ స్వాతంత్య్రం కింద చేసినవేనని అధికారులు చెప్పినట్లుగా సమాచారం.
పాక్‌కు అనుకూలంగా ప్రచారం
జ్యోతి మల్హోత్రాకు పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేయమని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఇది సంప్రదాయ యుద్ధం కాదని, సమాచార యుద్ధంగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జ్యోతి తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పెట్టి, దాడికి పాక్ పౌరులు బాధ్యులు కారని చెప్పినట్లు తెలుస్తోంది.
పాక్ అధికారులతో సంబంధాలు
పాక్‌కు అనుబంధంగా ఉన్న కొంతమంది వ్యక్తులు జ్యోతికి ఇతర పనులు కూడా అప్పగించారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ అనే అధికారితో జ్యోతి క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని పోలీసులు చెబుతున్నారు. అతను ఆమెను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి గూఢచర్యానికి వాడుకున్నట్లు సమాచారం.
పర్యటనలు, కదలికలపై దర్యాప్తు
జ్యోతి గతంలో పాక్‌కు పర్యటనలు చేసినట్లు, ఒకసారి చైనాకు కూడా వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు చిత్రీకరించినట్లు సమాచారం. అవి పాక్ ఏజెంట్లకు పంపినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది.
యూట్యూబ్, సోషల్ మీడియా పై చర్యలు
‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు.