Delhi: మహా కుంభమేళాపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆమె పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కుంభమేళా గురించి ప్రతిపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని, కనీసం రెండు నిమిషాల పాటు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
ఇక మంగళవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళాపై ప్రసంగించారు. దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహా ఉత్సవం దేశ ప్రజలను ఐక్యంగా నిలబెట్టిందని, భారత శక్తిని ప్రపంచానికి చాటిందని మోడీ అన్నారు.
అదే విధంగా, కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందని, యువత కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని ప్రధాని పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు కుంభమేళా ద్వారా తొలగిపోయాయని చెప్పారు.
ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ మహా కుంభమేళాలో సుమారు 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం రూ.3 లక్షల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్నాయి. కొన్ని చిన్నచిన్న ఘటనలు మినహా ఈ మహా ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పవిత్రమైన కుంభమేళా ఘనతను మరింత పెంచారు.