Delhi: దేశవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి, ఇప్పుడు మళ్లీ విజృంభించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించే స్థాయికి చేరింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, నిన్నటికి 4,302గా ఉన్న యాక్టివ్ కేసులు, ఈ రోజు 4,866కి చేరాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 564 కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు సమాచారం.
ఈ మృతుల్లో ఢిల్లీకి చెందిన ఐదు నెలల చిన్నారి కూడా ఉండటం చాలా బాధాకరం. ఆ చిన్నారికి ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆరుగురు మృతులు వృద్ధులు కాగా, వారిలో మధుమేహం, అధిక రక్తపోటు, న్యూమోనియా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకల్లో చెరో ఇద్దరు చనిపోయారు.
ప్రస్తుతం అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో (1,487) ఉన్నాయి. అనంతరం ఢిల్లీ (562), పశ్చిమ బెంగాల్ (538), మహారాష్ట్ర (526), గుజరాత్ (508) స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులోనే 105 కొత్త కేసులు నమోదవడం గమనార్హం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని, వీరిలో చాలామంది ఇతర అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నమోదవుతున్న కేసులలో చాలా వరకు స్వల్ప లక్షణాలతో ఉంటున్నాయని, బాధితులు ఎక్కువగా హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు. శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తప్పుడు సమాచారం, వదంతులకు బలవద్దని, అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని ప్రజలను కోరారు.

