Crime News: కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల వద్ద ఉన్నా, లేకున్నా మారాం చేస్తూ పిల్లలు అడిగిన దాన్నెల్లా కొనే దాకా ఒప్పుకోరు. ఏది అడిగితే అది కొనిచ్చేందుకు తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతుంటారు. దాని వల్ల నష్టం జరుగుతుందని తెలిసినా, ప్రేమానురాగాలతో, మారాం చేశాడనో కాదనలేదు. ఇక్కడా అదే జరిగింది. తనకు బైక్ కావాలన్న కొడుకును కాదనలేక అప్పు చేసి విలువైన బైక్‌ను కొనిచ్చారు. తీరా కొనిచ్చాక మురిపెం తీరకముందే వారి కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖపట్నం మహరాణిపేటలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌రావు కుటుంబం నివాసం ఉంటున్నది. వారి కుమారుడు హరీశ్ (19) ఇంటర్మీడియట్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన స్నేహితులను చూసి తనకూ ఓ బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. చేతిలో డబ్బుల్లేవని వారు నిరాకరించారు.
Crime News: బైక్ కొనివ్వాల్సిందేనని హరీశ్ మొండికేశాడు. దసరా పండుగకు ముందు నుంచి మంకుపట్టు పట్టి అలిగి కూర్చున్నాడు. కొడుకు మారాం చేయడంతో ఆ తల్లిదండ్రులు కరిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కోరికను తీర్చేందుకు ఆ తల్లిదండ్రులు అప్పుజేసి రూ.3 లక్షలతో దసరా రోజే కొత్త బైక్ కొనిచ్చారు. తమకు అంత స్థోమత లేకున్నా తమ కొడుకు కోరికను కాదనలేక వారు త్యాగం చేశారు.
Crime News: ఎంతో మురిసిపోయిన హరీశ్ హాయిగా బైక్‌పై దర్జాగా తిరగసాగాడు. తనకోసం తన తల్లిదండ్రులు అప్పు చేశారా? తప్పు చేశారా? అన్నది చూడని ఆ యువకుడు.. ఐదు రోజులుగా హ్యాపీగా ఉన్నాడు. ఆ ఆనందంలోనే టిఫిన్ చేసేందుకు అని తన స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్‌పై ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు. అక్కడే టిఫిన్ చేశారు.
Crime News: ఆ తర్వాత ఇద్దరూ కలిసి వినయ్‌ను ఇంటి వద్ద దింపేందుకు బైక్‌పై వెళ్లారు. మితిమీరిన వేగంతో వెళ్తుండగా, మార్గమధ్యంలో సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. హరీశ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే హరీశ్ చనిపోయాడు. వెనుక కూర్చున్న వినయ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
Crime News: టీనేజీ తీరలేదు.. చదువు పూర్తి కాలేదు.. ఉపాధి చూసుకోలేదు.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగానూ లేదు.. అయినా బైక్ కావాలంటూ మారాం చేశాడు. ఆ కొడుకుపై ప్రాణం తీపితో ఆ పేదింటి తల్లిదండ్రులు తమ తాహతుకు మించి ఖరీదైన బైక్‌ను అప్పు చేసి కొనిచ్చారు. తీరా చూస్తూ పెద్దయి తమను సాకుతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చి లోకాన్ని విడిచి వెళ్లాడు. ఈ ఘటన చూసైనా యువతలో మార్పు రావాలి. తల్లిదండ్రులకు కనువిప్పు కావాలి.