Madhu Yashki: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి రావడంతో ఆయన సచివాలయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
సచివాలయంలో ఘటన:
ఈరోజు సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబుతో ఒక సమావేశంలో పాల్గొనేందుకు మధు యాష్కీ గౌడ్ సచివాలయానికి వచ్చారు. సమావేశం జరుగుతుండగా, ఉన్నట్టుండి ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఇది చూసి ఆందోళనకు గురైన వెంటనే, సచివాలయం డిస్పెన్సరీ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం, ఎలాంటి ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.