Delhi: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల హత్యల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును వెలువరించారు. శిక్ష ఖరారును ఫిబ్రవరి 18న ప్రకటించనున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.
కేసు వివరాలు
1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై మొదట పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దీనిపై విచారణ చేపట్టి సజ్జన్ కుమార్‌పై అభియోగాలు మోపింది.
ప్రాసిక్యూషన్ వాదనలు
ప్రాసిక్యూషన్ ప్రకారం, మారణాయుధాలతో సాయుధులైన ఒక భారీ గుంపు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ గుంపు జస్వంత్ సింగ్ ఇంటిపై దాడి చేసి, అతని భర్త, కొడుకును హత్య చేయడంతో పాటు వారి ఇంటిని తగులబెట్టిందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.
విచారణలో సజ్జన్ కుమార్ కేవలం ఆ అల్లర్లలో పాల్గొన్న వ్యక్తి మాత్రమే కాకుండా, ఆ గుంపుకు నాయకత్వం వహించిన వ్యక్తి అని కోర్టు తేల్చింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను కోర్టు పరిశీలించింది. ఫిబ్రవరి 18న న్యాయస్థానం అతనికి శిక్షను ఖరారు చేయనుంది.