Bigg Boss Telugu: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ షో అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ సిద్దిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ షోలో ప్రసారమయ్యే కంటెంట్ అసభ్యకరంగా ఉందనేది ఫిర్యాదుదారుల ముఖ్య ఆరోపణ. ఇది సమాజంలో, ముఖ్యంగా యువతపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, అశ్లీలాన్ని పెంచుతోందని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు.
Also Read: Prabhas: ప్రభాస్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కు ట్రిపుల్ సర్‌ప్రైజ్!
ఇదే తరహా రియాలిటీ షో అయిన కన్నడ బిగ్ బాస్ కూడా గతంలో వివాదాలను ఎదుర్కొంది. కన్నడ బిగ్ బాస్ స్టూడియోను అధికారులు సీజ్ చేసిన ఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది. ఆ షో స్టూడియో నుంచి రోజుకు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తుందని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఆరోపించింది. నిర్వాహకులు నోటీసులను పట్టించుకోకపోవడంతో, ఎమ్మార్వో తేజస్విని అధికారులతో కలిసి స్టూడియోకు తాళాలు వేశారు. ఆ సమయంలో షూటింగ్ నిలిచిపోయి, కంటెస్టెంట్లను వేరే రిసార్ట్‌కు తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత షో తిరిగి ప్రారంభమైంది.
అయితే, తెలుగు బిగ్ బాస్‌పై వచ్చిన ప్రస్తుత ఫిర్యాదు కంటెంట్‌కు సంబంధించింది కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ షోపై ఫిర్యాదు నమోదవడం రియాలిటీ షో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

