Cm revanth: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వికారాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దుద్యాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుని, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం, భక్తులతో కలిసి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం నారాయణపేట జిల్లా అప్పకపల్లికి చేరుకుని, బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతున్న ఈ బంక్‌ను అభినందించిన సీఎం, మహిళల ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన పెంపొందించడంలో ఇది గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించిన సీఎం, ఇప్పుడు వాటిని మరింత ఆర్థికంగా స్థిరపరచాలని సంకల్పించినట్టు తెలిపారు.
మహిళలు ఆత్మగౌరవంతో జీవించేందుకు వారికోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, ప్రతి ఏడాది రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో ఇచ్చిన చీరల కంటే ఈసారి నాణ్యమైనవి అందించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1000 కోట్లను కేటాయించి, సమాఖ్య సభ్యులకు చీరలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.