Cm revanth: తెలంగాణ రాష్ట్రం మరోసారి చరిత్రను సృష్టించింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గర్వకారణంగా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంబేద్కర్‌కు నిజమైన ఘన నివాళిగా ఈ చర్య నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను స్మరించుకుంటోంది. ఇది మనమందరం కలసి సాధించిన చరిత్రాత్మక ఘట్టం” అని చెప్పారు.
ఇక రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కొనసాగుతున్న “ప్రజావాణి” కార్యక్రమం గురించి కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. 2023 డిసెంబరు నుండి ఇప్పటి వరకూ 117 సార్లు ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 54,619 అర్జీలు ప్రజలు సమర్పించారు. వీటిలో 68.4% అర్జీలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని సీఎం తెలిపారు.
ప్రజల అవసరాలను తెలుసుకొని, వేగంగా స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

