CM revanth: మా ప్రధాన లక్ష్యం పాతబస్తీకి మెట్రో తీసుకురావడం

CM revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి, మెట్రో విస్తరణపై మజ్లిస్ పార్టీతో చర్చల జరుపుతామని ప్రకటించారు. ఈ రోజు ఆయన ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. బెంగళూరు హైవేపై ట్రాఫిక్‌ను తగ్గించడానికి జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.800 కోట్లు వ్యయం చేశారు. ఈ ఫ్లైఓవర్‌కు ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును పెట్టారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో 11.5 కిలోమీటర్ల పొడవున ఉన్న అతిపెద్ద పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించామన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు.

హైదరాబాద్ అభివృద్ధే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రధాన మార్గమని సీఎం అభిప్రాయపడ్డారు. రోడ్ల విస్తరణ, మెట్రో రైలు విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు వంటి చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు. ఆక్రమణల వల్ల హైదరాబాద్ సుందరీకరణ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నగర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ప్రధాని నరేంద్రమోదీని కోరామని తెలిపారు.

పాతబస్తీకి మెట్రో రైలును తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మజ్లిస్ పార్టీతో కలిసి హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తామని, త్వరలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానిస్తామని ప్రకటించారు. రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతోందని, దీని వల్ల కాలుష్యం పెరిగిపోతుందనీ, ఇంధన వనరులు వృథా అవుతున్నాయనీ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *